మా ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. నిప్పు.. ఉప్పులుగా ఉండే మెగాస్టార్ , నందమూరి కుటుంబాల మధ్య మరో పోరు మొదలైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ దఫా పోటాపోటీగా మారనున్నాయి. మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు తమ మద్దతు ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆ వెంటనే తాను కూడా బరిలో ఉంటున్నట్టు జీవిత తెలిపారు. మంచు మోహన్‌బాబు తనయుడు విష్ణు కూడా అధ్యక్ష బరిలో నిలబడుతున్నట్టు వెల్లడించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. మరో నటి హేమ కూడా పోటీకు రెఢీ అన్నారు. జీవిత, హేమ వంటి నటీమణుల ప్రభావం పెద్దగా లేకపోయినా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్, బాలయ్యల మధ్య మూడుముక్కలాట భలేగా ఉంటుందనేది సీనీ పండితుల విశ్లేషణ. వీరిలో ప్రకాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం అండగా నిలవటం… అటువైపు బాలయ్య తొడకొట్టడం చూస్తుంటే ఈ దఫా బ్యాలెట్ పోరు మామూలుగా ఉండేలా లేదంటున్నారు సినీ జనాలు కూడా. అసలే కరోనాతో సినీ పరిశ్రమ కష్టాల్లో కూరుకుపోయింది. షూటింగ్‌లు లేక కార్మికులు తిండి కి అల్లాడి పోతున్నారు. సినీ పరిశ్రమను నమ్ముకున్న వేలాది కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటుంటి వేళ రెండేళ్లుగా చిరంజీవి కరోనా ఛారిటీ క్రైసిస్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉచితంగా కొవిడ్ టీకాలు కూడా ఇప్పిస్తున్నారు. తాజాగా పేదలకు ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు జిల్లాకో ఆక్సిజన్ బ్యాంకు సొంత ఖర్చుతో ప్రారంభించారు. అయినా.. చిరంజీవి పట్ల కొందరు విమర్శలు మానుకోలేదు.
అసలే చిరంజీవి అంటే మండిపడే బాలయ్య. గతంలో లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవరా అంటూ మీడియా అడిగితే. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలంటూ స్పందించారు. మా బ్లడ్ , బీడ్ వేరంటూ మాట్లాడారు. ఇటీవల కేసీఆర్‌ను కలసి సినీ ప్రముఖుల్లో బాలయ్య లేకపోవటంపై కూడా ఇలాగే స్పందించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాళ్లంటూ ఎద్దేవాచేశారు. మరో వైపు.. నందమూరి తారకరామారావు, కొణిదెల రామ్‌చరణ్ ఇద్దరూ ఆర్ ఆర్ ఆర్‌లో కలసి నటిస్తున్నారు. జూనియర్ ఫ్యాన్స్ కూడా బాలయ్య పట్ల వ్యతిరేకతగా ఉన్నారు. ఇలా భిన్నమైన వాతావరణంలో మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి కుటుంబం మధ్య జరిగే మా ఎన్నికల పోరు ఉత్కంఠగా మారిందనే చెప్పాలి. మరి దీనిపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ప్రకాశ్‌రాజ్‌పై తెలుగు సినీ పరిశ్రమలో వ్యతిరేకత ఉంది. కరాటే కళ్యాణి వంటి నటీమణులు ప్రకాశ్‌రాజ్ హిందు వ్యతిరేకిగా లెక్కిస్తున్నారు. ఇటువంటి సమయంలో టీడీపీ అనుకూల మీడియా బాలయ్యను స్తుతిస్తూ డిబేట్లు కూడా మొదలు పెట్టింది. చిరంజీవిని వైసీపీ అనుకూల వ్యక్తిగా చూపే ప్రయత్నాలు ప్రారంభించింది.