పశ్చిమకృష్ణాలో నందిగామ రాజకీయానికి ప్రత్యేక శైలి. అక్కడ నుంచి ఎవరు గెలిచినా మంత్రి పదవి గ్యారంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఒకప్పుడు ఎర్రజెండాకు కంచుకోట.. క్రమంగా కాంగ్రెస్ ఆ తరువాత టీడీపీ వరుస విజయాలతో దూసుకెళ్లాయి. 2019లో టీడీపీ తప్పిదాలు వైసీపీను గట్టెక్కించాయి. కమ్మ సామాజికవర్గం కీలకమైన నందిగామ నియోజకవర్గం ఎస్సీకు కేటాయించటంతో తంగిరాల ప్రభాకర్‌రావు విజయం సాధించారు. ఆయన మరణంతో తనయురాలు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ.. పాలనలో అంతకు ముందు దేవినేని వెంకటరమణ, ఉమా, తంగిరాల ప్రభాకరరావు స్థానాన్ని భర్తీ చేయటంలో తికమక పడ్డారు. పచ్చిగా చెప్పాలంటే పేరుకే సౌమ్య ఎమ్మెల్యే అయినా.. పెత్తనం అంతా ఉమా కనుసన్నల్లో ఆయన అనుచరులు సాగించేవారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ సౌమ్య ఓటమికి కారణమయ్యాయనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. అయితే.. నందిగామ పట్టణం మాత్రం టీడీపీ ఓటుబ్యాంకు ఉన్నట్టుగానే ఓటింగ్ సరళి చెబుతుంది. అటువంటి మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. ఇక్కడా దేవినేని ఉమా తప్పిదమే కారణమంటూ ఆ పార్టీ నేతలే బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా తమ నిరసన తెలిపారు.
గతంలో సర్పంచ్‌గా చేసిన శాఖమూరి స్వర్ణలతను వైసీపీలోకి తీసుకొచ్చి ఛైర్ పర్సన్ చేయాలనే మంతనాలు కూడా తెరచాటున జరిగినట్టుగా తెలుస్తున్నాయి. అయితే అప్పటికే ఏడాదిన్నరపాటు వైసీపీ తరపున నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ సీటుపై మండవ పిచ్చయ్య ఆశపెట్టుకున్నారు. పైగా వైసీపీ హైకమాండ్ కూడా ఓకే చేసింది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మండవ పిచ్చయ్య సతీమణి వరలక్ష్మి గెలుపొంది చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో పాలనలో ప్రజాభిమానం చూరగొంటున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా ఇంటిని నడిపిన ఓర్పును పాలనలోనూ చూపుతూ నందిగామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే ఇక్కడే అసలు గొడవ మొదలైంది.
రాజకీయంగా మండవ వరలక్ష్మిపై పై చేయి సాధించేందుకు సొంత నేతలే అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది . నందిగామ మున్సిపాలిటీ అధికారులు కూడా చైర్‌పర్సన్‌కు సహకరించట్లేదనే ఆరోపణలున్నాయి. ఆమెను కుర్చీ దించటం ద్వారా తమ వారిని సీట్లో కూర్చోబెట్టేందుకు నియోజకవర్గంలోని కీలక నేత టీడీపీ నాయకురాలితో మంతనాలు కూడా సాగించారట. వరలక్ష్మిపై ఒత్తిడి తీసుకురావటం ద్వారా తనకు తానే రాజీనామా చేయించాలనేది వారి ఎత్తుగడగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా అదనపు ఖర్చుల కింద.. రూ.40 లక్షల వరకూ బిల్లులు చూపి కొందరు నేతలు తమ జేబుల్లోకి మళ్లించునే ప్రయత్నం కూడా చేశారట. అయితే.. దీన్ని మున్సిపల్ చైర్ పర్సన్ అంగీకరించకపోవటంతో అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలను పురిగొల్పి తమ పబ్బం గడుపుకునేందుకు రాష్ట్ర స్థాయి నేత ఒకరు ప్రయత్నించి భంగపడినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కౌన్సెలర్లు కొందరు వైసీపీతో చేతులు కలిపి చైర్‌పర్సన్‌పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ దూషణకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా.. ఇదే కొద్దికాలం కొనసాగితే.. వైసీపీ అంతర్గత రాజకీయాలు బజార్నపడటంతోపాటు..టీడీపీలోని కోవర్టుల సంగతి కూడా బహిర్గతమవుతుందనేది నందిగామ ప్రజల అభిప్రాయం..