ఎవరి మాట వారిదే.. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవాలన్నదే లక్ష్యం. ఏపీలో విచిత్ర పరిస్థితులు.. వింత వాతావరణం. ఇదంతా ఎన్నికల వల్ల.. నాయకుల చేత వచ్చిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇదొక కుల వైరం.. ఏపీలో తామే పాలన సాగించాలనే పట్టుదల. వెరసి కొత్త రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ, వైసీపీ.. మధ్యలో నిమ్మగడ్డ అన్నట్టుగా ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రజల్ని కలవరపాటుకు.. ఒక విధంగా చెప్పాలంటే గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనే నేను.. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానంటారు. అబ్బే.. తూచ్ అంత సీన్‌లేదు. అసలు నిమ్మగడ్డ ఎలా ఐఏఎస్ అయ్యాడనేది కూడా అర్ధం కావట్లేదంటూ వైసీపీ నేతలు చెంపలు నొక్కుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి మరో అడుగు ముందుకేసి.. నా మాటే శాసనం.. శాసనబద్దంగా ఎన్నికైన మమ్మల్ని దిక్కరింతురా.. ఎవరు ఎన్నికల్లో అటు వైపు ఉంటారో.. ఆ ప్రభుత్వ ఉద్యోగులకు తరువాత చుక్కలే అంటూ వార్నింగ్ ఇస్తాడు. కాదంటే.. మేం చేసేది మేం చేస్తాం.. ఇది ఎమోషన్ డైలాగ్ కాదు.. కాచుకోండంటూ సవాల్ విసురుతున్నారు. పెద్దిరెడ్డి చెప్పాక.. సీఎం అయినా.. పీఎం అయినా ఏం చేయలేరంటూ వైసీపీ శ్రేణులు కూడా మా ముందు మీరంతా జూజూబీ అంటూ జబ్బలు చరచుకుంటున్నారట. దీంతో చిర్రెత్తిన ఎన్ ఈసీ 21 వరకూ పెద్దిరెడ్డిని ఇంట్లో బంధించమంటూ పచ్చ ఇంకుతో సంతకం చేశాడాయె.. వాళ్లు ఊరుకుంటారా.. కోర్టుకెళ్లారు. అంతే.. కోర్టు కూడా ఒక మంత్రిని హౌస్ అరెస్ట్ చేయటం మీ ఇష్టమేనా అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. అంతే.. ఇక 9వ తారీఖు జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ రచ్చ ఇంకెంత వరకూ దారితీస్తుందనేది పల్లె ప్రజల గుబులు. మరి పోలీసులు శాంతిభద్రతల నిర్వహణలో ఎలా విధినిర్వహణ చేస్తారనేది సవాల్‌గానే మారిందట.