వల్లభనేని వంశీ.. కొడాలి నాని ఇద్దరూ మంచి స్నేహితులు. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలుండవ్. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ అధినేత జగన్‌ను పాదయాత్రలో వంశీ కలిశాడు. దీనిపై పార్టీ శ్రేణులు రాద్దాంతం చేసినా లైట్‌గా తీసుకున్నాడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ కృష్ణాజిల్లాలో కమ్మసామాజికవర్గంలో బలమైన నాయకులు. మాస్‌లో మంచి ఇమేజ్ ఉన్ననేతలుగా ఎదిగారు. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి ఇప్పుడు అదే పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వంశీ మరో అడుగు ముందుకేసి మాటలతో చీల్చిచెండాడుతున్నాడు. దీనంతటికి కారణం.. అంతర్గత విబేధాలనేది పక్కనబెడితే.. బాబు కేవలం కొద్దిమందికే అవకాశం ఇస్తారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. పార్టీ నిబంధనలకు లోబడి ఉన్నా.. ఆత్మాభిమానంతో ఇద్దరూ క్రమంగా పసుపుగూటికి దూరమవుతూ వచ్చారు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా పట్టు సాధించారు. టీడీపీలో 2014-19 వరకూ ఐదేళ్లపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటూ అభిమానులతో వంశీ అనేవాడట. గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించినా, అభివృద్ధి కార్యక్రమాలున్న వంశీ కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ పలుమార్లు ఆయనే స్వయంగా ఆవేదన వెలిబుచ్చారు.
అదంతా గతం.. ఇప్పుడు కొడాలి సహకారంతో వంశీ వైసీపీ గూటికి చేరాడు. కానీ.. గన్నవరంలో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో ఎందుకో సర్దుకోలేకపోతున్నారు. ఇరు వర్గాలతో తరచూ గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇదంతా వంశీ వెనుక నుంచి నడిపిస్తున్నాడంటూ దుట్టా వర్గం ఆరోపిస్తుంది. వైసీపీ నేతగా తానే చెలామణీ అవుతున్నాడంటూ విషయం అదిష్ఠానం వద్దకు తీసుకెళ్లారు. దీనిపై వంశీ మాత్రం.. వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ కేవలం కుటుంబానికి సంబంధించినదంటూ కొట్టిపారేశారు. అవగాహన లేకుండా దుట్టా కల్పించుకుంటున్నారంటూ చురకేశారు. తానే నాలుగు అడుగులు వెనక్కి తగ్గి ఆలోచిస్తున్నానంటూ సమర్ధించుకున్నారు. గన్నవరంలో వైసీపీ నేత ఎవరనేది పార్టీకు తెలుసంటూ తెగేసి చెప్పారు. మరి వంశీ మాటలకు అర్ధాలే వేరులే అన్నట్టుగా మున్ముందు అంతర్గత పోరు ఎంత వరకూ దారితీస్తుందో మరీ.
గుడివాడలో కొడాలిని ఢీకొట్టేందుకు 2019లో దేవినేని వారసుడు అవినాష్‌ను దింపారు. ఎన్నికల సమయంలో గట్టిగానే నిలబడినా.. నాన్‌లోకల్ ముద్రతో అవినాష్ ఓడాడు. ఆ తరువాత.. టీడీపీ భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఎటుచూసినా గుడివాడలో కొడాలికి ధీటుగా నిలబడేందుకు విపక్షాలకు నేతలే కరవయ్యారనాల్సిందే. తరచూ ఏవో వివాదాలు.. వివాదాస్పద కామెంట్స్‌తో కొడాలి నాని హాట్‌టాఫిక్ గా మారుతుంటాడు. జగన్ వద్ద కూడా మాంచి ఇమేజ్ ఉండటంతో ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితి. అమరావతి రాజధాని తరలింపుపై అక్కడి రైతులు, ప్రజలు దాదాపు 270 రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే ప్రాధాన్యనిచ్చింది. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలోకి చేరింది.
అక్కడ నాటి సర్కారు సేకరించిన భూములను పేదల ఇళ్లకోసం కేటాయించటాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులకు కోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ పేదల ఇళ్ల నిర్మాణానికి కోర్టు అభ్యంతరం వ్యక్తంచేస్తే శాసనరాజధానిగా కూడా అమరావతి అంగీకరించనంటూ కొడాలి అంటున్నారు. పేదలు వద్దనే రాజధాని మాకూ వద్దంటూ విషయాన్ని జగన్ వద్దకు తీసుకెళ్తానంటున్నాడు. అమరావతి రాజధాని తరలింపులపై కమ్మ సామాజికవర్గ ప్రముఖులు వ్యతిరేకిస్తున్న సమయంలో కొడాలి వ్యతిరేకంగా ఉండటాన్ని కమ్మసామాజికవర్గం మండిపడుతోంది.



