పవన్ కళ్యాణ్ ఆ పేరొక్కటి చాలు. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు.. నిరాశలో ఉన్నవారిలో జోష్ తెచ్చేందుకు ఇది పొగిడేందుకు చెబుతున్న మాటలు కాదు. జనసేనాని ప్రతి అడుగులో జనం పలికే జేజైలకు నిలువెత్తు సాక్ష్యాలు. ప్రత్యర్థులు కూడా పవన్‌ను విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నామంటూ చెప్పేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందాకా ఎందుకు.. ఒక వైసీపీ నాయకుడు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలు పవన్ ఫ్యాన్స్ అంటూ గర్వంగా చెప్పారట. ఎందుకు సార్.. భయం లేకుండా ఇలా అంటున్నారంటే.. ఈ తరం యువత మనలాంటి రాజకీయ నాయకులను నమ్మట్లేదంటూ బదులిచ్చారట. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. పవన్ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ అని చాటేందుకు.. అందాకా ఎందుకు.. 2019 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసినా గెలవలేదు. రాజోలు నుంచి గాజుగ్లాసు గుర్తుమీద గెలిచిన రాపాక కూడా వైసీపీ పంచన చేరారు. పవన్‌ను విమర్శించాడు. అసలా పార్టీ గాలివాటంగా వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించారు.
కానీ ఇవేమీ పవన్‌ను వెనుకడుగు వేసేలా చేయలేకపోయాయి. పైగా రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెట్టించేంత దృఢంగా మార్చాయి. ఇప్పుడు నిఫర్ తుపానులో నష్టపోయిన రైతులకు భరోసానిచ్చేందుకు పవన్ జై కిసాన్ యాత్ర చేపట్టారు. దీనికి కొన్నిచోట్ల వైసీపీ కేడర్ నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇక్కడే తొలిసారిగా పవన్ గట్టిగా మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలు ఇలాగే తెగిస్తే.. జనసేన కార్యకర్తలు కూడా ఇంతకు మించి తెగిస్తారంటూ హెచ్చరించారు. కేవలం పవన్ సైలెంట్‌గా ఉండమన్నారనే ఒకే ఒక్క కారణంతో జనసైనికులు సైలెంట్‌గా ఉన్నారంటూ చెప్పకనే చెప్పారు. ఏ మాత్రం జనసైనికులపై దాడులు చేసినా.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో రుచిచూపిస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు కొడితే.. పారిపోయేందుకు మేం ఇతర పార్టీ కార్యకర్తలం కాదంటూ పిలుపునిచ్చారు. నిజమే.. పవన్ యాత్రకు ఎవ్వరూ ఊహించని స్పందన వస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఇలా అడుగు పెట్టిన ప్రతిచోట పవన్‌కు జనం నీరాజనం పడుతున్నారు. ఈ ఒక్కటి చాలు.. ఓటమి పవన్‌ను జనం నుంచి దూరం చేయలేదు.. మరింత దగ్గర చేసిందని చెప్పేందుకంటూ జనసైనికులు, మెగా అభిమానులు చెబుతున్నారు.
ఈ లెక్కన ఫిబ్రవరిలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన దుమ్మురేపినా.. వైసీపీ, టీడీపీలకు చుక్కలు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.