ఏపీలో మాజీలు రాజీ ప‌డ‌లేక‌!

నిన్న‌టి వ‌ర‌కూ పెత్త‌నం చేస్తిరి. మంది మార్బ‌లంతో రాచ‌మ‌ర్యాద‌లు అందుకొంటిరి. పోలీసుల‌తో సెల్యూట్లు.. బ్యూరోక్రాట్ల‌తో వంగివంగి దణ్నాలు పెట్టించుకుంటిరి. మ‌రో ఐదేళ్లు కూడా ఇవే రాజ‌బోగాలు అనుకుంటిరి. కానీ. అస‌లే ఏపీ ప్ర‌జ‌లు.. కీలెరిగి వాత‌పెట్ట‌డం.. బుగ్గ‌గిల్లి జోల‌పాడ‌టం వాళ్ల‌కు తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌దాయె. అందాకా ఎందుకు.. అస‌లు ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా 2020 వ‌ర‌కూ ఆయ‌నేనంటూ పొంగిపోయిన చంద్ర‌బాబునాయుడును ప‌దేళ్ల త‌రువాత కుర్చీ దించారు. ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు. ప‌దేళ్లు రాజ్య‌మేలిన‌.. కాంగ్రెస్‌కు డిపాజిట్టు లేకుండా చేశారు. ఏకంగా పార్టీను క‌నుమ‌రుగు చేసేశారు. ఇదీ ఏపీ లోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఏకాత్మ‌క ఆలోచ‌న‌. అంటే.. ఒకే త‌ర‌హాగా ఆలోచించి.. ఎవ‌ర్ని దెబ్బేయాల‌నేది ఒకేసారి నిర్ణ‌యించుకోగ‌ల స‌మ‌ర్థులు ఆంధ్రులు.

క‌ళ్లెదుట ఇవ‌న్నీ చూసిన నేత‌లు.. ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల్లో త‌ల‌లు పండిన నాయ‌కులు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా చేసిన సీనియ‌ర్లు. అయినా.. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే.. ఎప్ప‌టికి సైకిల్ స‌వారీ అనుకున్నారు. కానీ.. జ‌గ‌న్ రూపంలో ముంచుకొస్తున్న సునామీను గుర్తించ‌లేక‌పోయారు. ఒక్క దెబ్బ‌కు రాచ‌బోగాలు మాయ‌మ‌య్యాయి. మందీమాగ‌దులు దూర‌మ‌య్యారు. ఇప్పుడు.. అన్నీ క‌ష్టాలే. మాజీలుగా మారి రాజీప‌డ‌లేక కునారిల్లుతున్నారు. అచ్చెన్నాయుడు, య‌ర‌ప‌తినేని, చింత‌మ‌నేని, దేవినేని, కేశినేని, బోండా ఉమా, వెంక‌న్న, జేసీ బ్ర‌ద‌ర్స్ .రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, నిమ్మ‌ల రాజ‌ప్ప‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మాజీలు.. ఇప్పుడున్న అధికార పార్టీతో రాజీప‌డ‌లేక‌.. నిన్న‌టి వ‌ర‌కూ అనుభ‌వించిన బోగాలు మ‌ర‌చిపోలేక త‌ర్జ‌న‌ భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. నారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు వంటి వాళ్లు ఏనాడో తెర‌మ‌రుగయ్యారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌పుడు చూసుకుందాంలే అనే రాజీధోర‌ణిలో ఉన్నారు. ఇలా రాజీప‌డ‌లేక‌.. అటు పోట్లాడేందుకు శ‌క్తిసామ‌ర్థ్యాలు చాల‌క కొట్టుమిట్టాడుతున్న నేత‌లే జైలు ఊచ‌లు లెక్క‌బెడుతూ.. వైసీపీను శాప‌నార్ధాలు పెడుతూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here