నిన్నటి వరకూ కులాల కుంపటిగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మత కలహాలకు కేరాఫ్ చిరునామాగా మారింది. యూపీ, పశ్చిమబంగ వంటి చోట్ల కూడా కనిపించని దారుణ పరిస్థితులు ఏపీలో చిచ్చుపెడుతున్నాయి. ఇదంతా రాజకీయ లబ్దికోసమే తెరచాటును ఎవరో నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మూడు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ ఎవరికి వారే ఎదుటివారిపై ఆరోపణలు చేసుకుంటూ తాము శుద్ధపూసలమని జనాల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఇటువంటి మతమపరమైన అంశాల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. ఒక మతానికి అనుకూలంగా తీసుకునే నిర్ణయాలు ఐకమత్యంగా ఉండే ప్రజల మధ్య దూరాన్ని పెంచుతాయనేది కూడా మేధావుల ఆందోళన. కానీ ఏపీలో వైసీపీ అధికారం చేపట్టాక వరుసగా 150కు పైగా దేవాలయాలు విగ్రహాల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటనలు జరిగాయి. ఇవన్నీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉండటమే అసలు ఆందోళనకు ప్రధాన కారణం. క్రైస్తవాన్ని అనుసరించే కుటుంబంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు జగన్ సీఎం అయ్యాక దారుణాలు పెరిగాయి. ఏ ప్రభుత్వం కూడా ఒకే మతానికి అనుకూలంగా పనిచేసే ప్రయత్నాలు ప్రత్యక్షంగా చేయవు. పరోక్షంగా కూడా ప్రోత్సహించే సాహసాన్ని చేయలేవు. అయితే ఎవరో కావాలనే.. జగన్ క్రైస్తవం ఆచరిస్తారు కాబట్టి.. ఇతర మతాలను ముఖ్యంగా హిందుత్వ ద్వేషిగా ప్రచారం చేయాలనేది అవతలి వైపు వారి అంతరంగం కావచ్చంటూ పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ రహస్య పార్టీ ఏదనేది ఇప్పుడు సస్పెన్స్.
మొన్న అంతర్వేది.. నిన్న రామతీర్ధం.. ఇప్పుడు బెజవాడ. నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు కూడా జతకట్టారు. బీజేపీ అంటే ఎలాగూ తాము హిందు సంరక్షకులమంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు కొత్త పల్లవి అందుకోవటం వైసీపీకు అనుకూలంగా మారింది. గత ప్రభుత్వం తొలగించిన దేవాలయాలు, మసీదులపై చర్చ మొదలు పెట్టింది.
తాజాగా సుబ్రమణ్యం అనే ఒక రాజకీయ కురువృద్ధుడు.. ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చంద్రబాబు ఉండవచ్చనే అనుమానం వ్యక్తంచేసి బీజేపీ, వైసీపీలకు మాంచి అవకాశం కల్పించారు. కానీ.. మొన్న రామతీర్ధం పర్యటనకు వైసీపీ, టీడీపీ నేతలను అనుమతించిన పోలీసులు సెక్షన్ 144 పేరుతో బీజేపీ, జనసేనలను అడ్డుకోవటం మరింత రచ్చకు కారణమవుతోంది. రాజకీయపార్టీలుగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించాల్సిన సర్కారు కూడా ఆజ్యం పోసేలా వ్యవహరించటం.. హిందుత్వ వాదుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఏమైనా.. కులపంచాయతీలతో కొట్టుకులాడే ఏపీ వంటి చైతన్యవంతమైన రాష్ట్రంలో మత పరమైన గొడవలు ప్రజల మధ్య ఇంకెంత దూరాన్ని పెంచుతాయనే ఆందోళన లేకపోలేదు. తాజాగా సోము వీర్రాజు పట్ల వ్యవహరించిన తీరు కూడా గొడవను మరింత పెంచేదిగా ఉందనే భావన కూడా నెలకొంది.