హేమిటో.. కొన్ని మంత్రిత్వ శాఖలు ఇంతే.. ఒక పట్టాన అర్ధం కావు. దేవాదాయశాఖ చాలా పవిత్రమైనదిగా గుర్తింపు ఉంది. కానీ.. ఆ పదవిలో కొనసాగటం కత్తిమీద సాముగా ఉంటుంది. అదే సమయంలో భవిష్యత్ రాజకీయాలు కూడా ముగిసినట్టే అనే సెంటిమెంట్ కూడా లేకపోలేదు. గతంలో దేవాదాయశాఖ మంత్రులుగా పనిచేసిన జువ్వాది రత్నకుమార్, కే.ఈ.కృష్ణమూర్తి, పైడి కొండలరావు తదితరులు ఆ తరువాత క్రమంగా రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. స్పీకర్ పదవి అంటే.. ఎంతగా గుబులు పడతారో.. దేవాదాయశాఖ మంత్రి అనగానే నేతల్లో అంతే భయం ఉంటుంది. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఏదోమూలన హిందు దేవాలయాల అంశంపై తలనొప్పులు చవిచూస్తూనే ఉన్నారు. సున్నితమైన అంశం కావటంతో్ ఎవర్నీ తప్పుబట్టలేని పరిస్థితి. మొన్న బిట్రగుంట, నిన్న అంతర్వేది.. నేడు కనకదుర్గమమ్మ దేవాలయంలోని రథం పక్కన ఉన్న సింహాల బొమ్మలు మాయం కావటం. అదే సమయంలో విజయవాడ రూరల్‌లోని సాయిబాబా దేవాలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయటం. ఎవరైనా ఆచార, సంప్రదాయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎవ్వరూ కూడా కావాలని దాడులు చేసేందుకు తెగబడరు.
కానీ.. ఏపీలో జగన్ సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస దాడులతో హిందువుల్లో ఆందోళన మొదలైంది. అంతర్వేది ఘటనతో అది తారాస్థాయికి చేరింది. భారీగా తరలివెళ్లిన హిందుధార్మిక సంఘాలు ధర్నా చేశాయి. అక్కడ విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు కరోనా భారిన పడటం సంచలనంగా మారింది. దీనిపై జగన్ ప్రభుత్వం సీరియస్‌గానే నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కావాలనే ఎవరైనా పనిగట్టుకుని ఇవన్నీ చేయిస్తున్నారనే అనుమానం కూడా వైసీపీ శ్రేణుల్లో నెలకొన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం, సప్తగిరి మాసపత్రికలో అన్యమత పుస్తకాల పంపిణీ.. ఇలా.. వరుసగా ఏవో వివాదాలు.. తరచూ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. రాజకీయాలను పక్కనబెట్టిన సీఎం జగన్ పూర్తిగా ప్రజాసంక్షేమంపై దృష్టిసారించారనేది ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ. మతపరమైన అంశాల్లో ఎదురవుతున్న చికాకులు శాంతిభద్రతల సమస్యగా మారుతుందనే ఆందోళన లేకపోలేదు. అందుకే.. సీఎం జగన్ మోహన్‌రెడ్డి సీరియస్‌గానే పరిగణించారు. కానీ.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు దీన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదంతా విపక్షాల కుట్రగా చెబుతున్నా ఆధారాలు దొరకట్టేదు. అందుకే.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఫలానా దాడులు జరిగాయంటూ విమర్శించటం ద్వారా ఆత్మరక్షణలో పడినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటుచూసినా వెల్లంపల్లికి వరుస ఘటనలు సవాల్‌గానే మారాయి.