ఔను.. అఖిల‌ప్రియ ఒంట‌రిగా మారింది!!

అతిగా ఆశ ప‌డిన మగాడు.. అతిగా ఆవేశ‌ప‌డిన ఆడ‌ది సుఖ‌ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు. ర‌జ‌నీకాంత్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌. ఏపీ రాజ‌కీయాల‌కు రెండూ వ‌ర్తిస్తాయి. ఒక‌రు కొద్దికాలంలోనే కోట్లు సంపాదించాల‌ని ఏడాదిన్న‌ర‌పాటు చిప్ప‌కూడు తినాల్సి వ‌చ్చింది. మ‌రొక‌రు అతిగా ఆవేశ‌ప‌డి ఒంట‌రిగా జైలు ఊచ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌స్తోంది. భూమా ఆఖిల‌ప్రియ‌.. క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబం లేకుండా రాజ‌కీయాలు నెర‌ప‌లేరంటే అతిశ‌యోక్తి కాదేమో.. 1990 నుంచి భూమా నాగిరెడ్డి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌టం ప్రారంభించారు. ముగ్గురు పిల్ల‌లు.. శోభానాగిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో న‌డిచే మందీమాగ‌దులు. 2014 ముందు వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. ఆ పిల్ల‌లు ఎవ‌రో ప్ర‌పంచానికి కూడా తెలియ‌దు. అటువంటిది.. శోభ‌నాగిరెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం. ఇవ‌న్నీ రాజ‌కీయాలు.. కుట్రలు కుతంత్రాలు.. వెన్నుపోట్లు. ఫ్యాక్ష‌న్ ప‌గ‌లు తెలియ‌ని అఖిల‌ప్రియ రాజ‌కీయ అరంగేట్రం.. రావ‌ట‌మే మంత్రిగా అధికారం.. ఒక‌సారి జీవితాన్ని ఓడిపోయిన ఆమె జీవితంలోకి జ‌త‌గా భార్గ‌వ్‌రామ్‌.. అన్నీ క‌ల‌గా జ‌రిగిపోయాయి. అప్ప‌టి వ‌ర‌కూ అన్నీతానై న‌డిపించిన భూమా అనుచ‌ర‌గ‌ణం.. అఖిల‌ప్రియ‌లోనే నాగిరెడ్డి, శోభ‌ను చూసుకోవాల‌నుకున్నారు.

కానీ.. అఖిల మాత్రం అంద‌ర్నీ దూరం చేసుకుంటూ వ‌చ్చింది. ఫ‌లితంగా వెన్నెముక వంటి ఎస్వీసుబ్బారెడ్డిని చంపేంత వ‌ర‌కూ చేరింది. అంతే.. అధికారంలో ఉన్న‌పుడు ఆమె నీడ‌గా మారిన భ‌ర్త భార్గ‌వ్‌రామ్ షాడో మంత్రిగా సెటిల్‌మెంట్లు చేస్తూ పోయాడు. అప్పుడు అదికారం ఉండ‌టంతో అధికారులూ మౌనం వ‌హించారు. కానీ.. కాలం ఒకేలా ఎందుకు ఉంటుంది.. 2019 త‌రువాత మాజీలుగా మారినా అదే పెత్త‌నం చెలాయించేలానే టెంప‌రిత‌నం. సైలెంట్‌గా ఉండాల్సిన స‌మ‌యంలో అతిగా ఆవేశ‌ప‌డ‌టం వంటివి భూమా వార‌సురాలిగా చిక్కులు తెచ్చాయి. హ‌ఫీజ్‌పేట్‌లో 100 ఎక‌రాల భూ వివాదంలో తెలివిగా త‌న‌ను ఇరికిస్తున్నార‌నే గ్ర‌హించేలోపు.. ఆమెలోని ఆవేశం మ‌రో అడుగు ముందుకేసింది. కేసులో ఇరుక్కునేలా చేసింది. ఇప్పుడు గ‌ర్బ‌వ‌తిగా కోట్ల ఆస్తులున్నా.. ఎవ‌రూ లేని అనాథ‌గా జైలు ఊచ‌లు లెక్క‌పెట్టేలా చేశాయి.

అమ్మానాన్న‌.. తోబుట్టువులు.. భ‌ర్త ఎవ్వ‌రూ ఆమెను జైలు నుంచి బ‌య‌టకు తీసుకురాలేక‌పోతున్నారు. ఇదంతా.. రాజ‌కీయ‌చ‌ద‌రంగంలో ప్ర‌త్య‌ర్థులు ఆడిన ఆట అని తెలియ‌కుండానే ఆమె పావుగా మారారు. అఖిల‌ప్రియ త‌న భుజం పైనుంచి తుపాకీ పేల్చుతుంటే చూస్తూ ఉండ‌ట‌మే ఇన్ని క‌ష్టాల‌కు కార‌ణ‌మంటూ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అనారోగ్యం, గ‌ర్బం.. దూర‌మైన భ‌ర్త‌. కేసులు.. స‌హాయం చేసేందుకు ఎవ‌రూలేకుండా పోయిన వాతావ‌ర‌ణం.. ఇవ‌న్నీ అఖిల‌ప్రియ‌ను మ‌రింత క‌ట‌వుగా మార్చుతాయో.. జీవితంప‌ట్ల విర‌క్తిని పెంచుతాయో చూడాల్సిందే. నాటి త‌రం రాజ‌కీయ ఉద్దండుల వార‌సులుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌.. రాబోతున్న వారికి అఖిలప్రియ జీవితం.. ఆమె అనుభ‌వాలు గొప్ప గుణ‌పాఠాలుగా మ‌ల‌చుకుంటే చాల‌నేది విజ్ఞుల సూచ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here