బెజ‌వాడ‌లో మ‌ర్డ‌ర్‌.. అస‌లేం జ‌రిగిందీ!

అత‌డి పేరు మ‌హేష్‌. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌రేట్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వ‌చ్చె నెల‌లో పెళ్లి. అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అంత‌లో ఏమైందో.. స్నేహితుల‌తో స‌ర‌దాగా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రో అగంత‌కులు వ‌చ్చారు. గొడ‌వ పెట్టుకున్నారు. తుపాకీ తీసి కాల్పులు జ‌రిపారు. అది కూడా గురిచూసి గొంతుకింద కాల్చారు. ఇదంతా బెజ‌వాడ శివారులో జ‌రిగిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. అస‌లు ఇంత దారుణానికి ఎవ‌రు తెగ‌బ‌డ్డారు. అస‌లేం జ‌రిగిందీ అనేదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. శ‌నివారం అర్ధ‌రాత్రి మ‌హేష్ అత‌డి స్నేహితులు సుబ్బారెడ్డి బార్ వ‌ద్ద పార్టీ చేసుకుంటున్నారు. ఇంత‌లో స్కూట‌ర్‌మీద వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డే త‌చ్చాడారు.

మ‌హేష్ స్నేహితుల వ‌ద్ద‌కెళ్లి.. అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటూ నిల‌దీశారు. తాము అలాంటిదేమీ మాట్లాడ‌టంలేదంటూ స‌మాధానం ఇస్తుండ‌గానే గొడ‌వ‌కు దిగారు. అంతే జేబులో నుంచి నాటుతుపాకీ తీసి కాల్చారు. రెండు బుల్లెట్లు మ‌హేష్ ఒంట్లోకి దూరాయి. మ‌రో రెండు దారి త‌ప్పాయి. ఒక్క బుల్లెట్ మాత్రం మ‌హేష్ స్నేహితుడికి త‌గిలిన‌ట్టు తెలుస్తోంది. కాల్పులు జ‌రిపిన త‌రువాత వారంతా కారులో ప‌రారీ అయ్యారంటున్నారు సాక్షులు. అయితే.. ఇదంతా త‌మ‌కు క‌ల‌గా ఉందంటూ అక్క‌డే ఉన్న మ‌హేష్ స్నేహితులు చెప్ప‌టం కూడా అనుమానాల‌కు తావిస్తోంది. తాము అమ్మాయిల గురించి మాట్లాడ‌లేదంటూ ఎందుకు చెప్పారు. అస‌లు వీరంతా ఆ స‌మ‌యంలో అక్క‌డ‌కు ఎందుకు చేరారు. వీళ్ల‌ను వెంబ‌డిస్తూ సుపారీ గ్యాంగ్ వ‌చ్చినా ఎందుకు గ‌మ‌నించ‌లేక‌పోయార‌నే ప్ర‌శ్న‌లు త‌ల్తెత్తున్నాయి. రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాలు, అనైతిక సంబంధాలు హ‌త్య‌కు కార‌ణం కావ‌చ్చ‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కీ ఆ మ‌హిళ ఎవ‌రు? మ‌హేష్ పెళ్లి కి ముందు ఇంత‌టి దారుణానికి ఎందుకు తెగ‌బ‌డ్డారు? దీంట్లో ఏమైనా ప్రేమ వ్వ‌వ‌హారం దాగిందా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కార‌మే హంత‌కులు దారుణానికి తెగ‌బ‌డ్డారు. మ‌హేష్ క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తూ స్కెచ్ వేసిన సుపారీ గ్యాంగ్ ముందుగానే ప‌థ‌కాన్ని సిద్ధం చేసుకున్నారు. అద‌ను చూసి చంపేందుకు అనువైన స్థ‌లం కోసం వెతికారు. అర్ధ‌రాత్రి దాటాక‌.. జ‌న‌సంచారం త‌గ్గ‌టం.. అప్ప‌టికే మ‌ద్యం మ‌త్తులో ఉన్న మ‌హేష్ అత‌డి స్నేహితులు నిస్స‌హాయులుగా మార‌టం సుపారీ గ్యాంగ్‌కు మ‌రింత క‌ల‌సివ‌చ్చిన‌ట్ట‌యింది. అనుకున్న‌ప‌ని క్ష‌ణాల్లో చ‌క్క‌బెట్టుకుని పారిపోయారు. వెళ్తూ.. మిగిలిన వారి వ‌ద్ద డ‌బ్బులు, ఆభ‌ర‌ణాలు ఉన్నాయ‌ని వెతికారంటూ మృతుడి స్నేహితులు చెబుతున్నారు. దీన్నిబ‌ట్టి వ‌చ్చిన ముఠా సుపారీగ్యాంగ్ అనే అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్నిస్తున్నాయి. ఇప్ప‌టికే బెజ‌వాడ‌లో రౌడీముఠాలు ఆధిప‌త్య పోరు కోసం బ‌రితెగిస్తున్నాయి. గ‌తంలోనూ సందీప్ అనే యువ‌కుడుని దారుణంగా హ‌త‌మార్చారు. త‌ర‌చూ ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌టం.. దీనివెనుక కొన్ని రాజ‌కీయ శ‌క్తుల ప్ర‌మేయం ఉండ‌టం కూడా విజ‌య‌వాడ‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. పోలీసు కార్యాల‌యంలో ప‌నిచేసే ఉద్యోగే ఇలా హ‌త్య‌కు గురికావ‌టం సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు కూడా కేసును సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇప్ప‌టికే ఒక మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. రియ‌ల్ లావాదేవీలు.. మ‌హిళ‌తో ఉన్న సంబంధం కూడా హ‌త్య‌కు దారి తీసి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో గుర్తించిన‌ట్టు స‌మాచారం.

1 COMMENT

  1. ఒక వర్గం విజయవాడలో మరియు రాష్జ్త్రం లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అశాంతిని సృష్టిందనేది ప్రజాభిప్రాయం..ఈ అల్లర్లు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు అని చూస్తున్నట్లు ప్రజలు చెవులు కొరుకుంటున్నారు. దేవాలయాలపై దాడి, ప్రముఖుల విగ్రహాలపై దాడి కూడా ఇందులో భాగమే కావచ్చేమో..

Leave a Reply to Pvrao Cancel reply

Please enter your comment!
Please enter your name here