గడ్డం బ్యాచ్.. బ్లేడ్ గ్యాంగ్.. చెడ్డి ముఠాలు.. అయితే బ్యాచ్లందు గడ్డంగ్యాంగ్లు వేరయా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మొన్నీ మధ్య గుడివాడ లో పేకాట క్లబ్బులపై పోలీసుల దాడులు. రూ.4 కోట్లు పట్టుకోవటం.. కీలక నేతలు అరెస్టవటం జరిగాయి. మామూలు రోజుల్లో అయితే ఇదంతా సాధారణంగానే భావించేవారు. కానీ.. జనసేనాని పవన్ గుడివాడ పర్యటనలో పేకాట క్లబ్బులు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయంటూ బాంబు పేల్చారు. మీరు పేకాటక్లబ్బులు నిర్వహిస్తే తప్పులేదుకానీ.. మేం సినిమాలు చేస్తే తప్పా ! అంటూ నిలదీయటంతో వైసీపీ నేతలలు మూకుమ్మడిగా పవన్‌పై మాటల దాడి చేశారు. ఇటువంటి సమయంలో పోలీసుల దాడులు.. గుడివాడలో పేకాల క్లబ్బులు నిజమనే విషయం బయటపడింది. పవన్ చేసిన విమర్శలు వాస్తవమే అనే భావన జనాల్లో పడింది.
ఇది నిజంగానే మంత్రిగారికి ఎంత నామోషీయో.. వైసీపీ ప్రభుత్వానికి కూడా గొడ్డలిపెట్టుగానే భావిస్తున్నారు. అయితే.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేకాట, కోడిపందేలు అనేవి కొత్తేమి కాదు. అయితే. అప్పట్లో ఏ పండుగలకో.. వేడుకలకే సరదాగా జరిగేవి. కానీ ఇప్పుడు ఏకంగా పేకాటను పార్టీలకు అతీతంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గుడివాడ, కైకలూరు, విజయవాడ పరిధిలో గడ్డం గ్యాంగ్‌ల కనుసన్నల్లోనే పేకాట క్లబ్బులు కొనసాగుతుంటాయి. ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. బయటి వ్యక్తుల కదలికలు కనిపిస్తే చాలు.. చంపేసి చెరువులో పడేసేందుకు వెనుకాడనంతగా ఉంటారు. రెండు కిలోమీటర్ల మేర గడ్డం గ్యాంగ్‌లు పహారా కాస్తుంటాయి. పోలీసుల దాడులపై
ఉప్పందించేందుకు ఎలాగూ.. ఖాకీల్లోనూ కక్కుర్తి బ్యాచ్ ఉండనే ఉంటుంది. ఇటువంటి వారే దళారులుగా మారి సమాచారం అందజేస్తూ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారనే ఆవేదన కూడా లేకపోలేదు. అసలు ఎవరీ గడ్డం గ్యాంగ్.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ క్లబ్బులను దర్జాగా నడుపుతూ సమాజాన్ని గబ్బు పట్టిస్తున్న ఘనులు ఎవరనేది అందరికీ తెలిసినా
ఎవరికీ తెలియనట్టుగా ఉండటం గడ్డం గ్యాంగ్ ప్రత్యేకతలట.