టీడీపీలో ఏదో జరుగుతోంది. ఎవరో పథకం ప్రకారం చంద్రబాబును దెబ్బతీసేందకు పథక రచన చేస్తున్నారు. అయినా.. ఇలాంటోళ్లు ఎంతమంది పార్టీ నుంచి వెళ్లినా కొత్తవాళ్లతో తిరిగి బలాన్ని సాధించుకోగల సత్తా పార్టీకు ఉందంటూ స్వయంగా అధినేత చంద్రబాబునాయుడు ధీమాగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ శక్తిని ఎవ్వరూ అంచనా వేయట్లేదు. కానీ.. గతం మాదిరిగానే జనాల్లో అదే నమ్మకం ఉందా! అనేది అసలైన అనుమానం. కానీ అధికారం మారినపుడు గోడదూకి అవతల పార్టీలోకి చేరటం ప్రతిపక్ష పార్టీల్లో నిత్యం కనిపించేదే. ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటూ టీడీపీ సీనియర్ నేతలు సమర్ధించుకునేవారూ లేకపోలేదు. కానీ అసలు సమస్య ఏమిటంటే.. గతానికి భిన్నంగా పార్టీ వీడేవారంతా చంద్రబాబుపై దుమ్మెత్తి పోయటమే కలకలం సృష్టిస్తోంది.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పక్కకు చేరారు. ఇటీవలే సీనియర్ నాయకుడు గద్దె బాబూరావు. 2004 నుంచి తనకు పార్టీలో అన్యాయం జరుగుతుందంటూ పార్టీకు రాజీనామా చేశారు. అదే బాటలో ఇప్పుడు గల్లా అరుణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచారు. టీడీపీ తరపున ఢిల్లీలో గొంతు వినిపిస్తున్న నేతల్లో ఆయన మాత్రమే మిగిలారు. ఇప్పుడు తల్లి పార్టీను వీడటం వల్ల జయదేవ్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది కూడా ఆసక్తిగా మారింది. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో గల్లా కుటుంబానికి వియ్యం ఉంది. మరి ఇప్పుడు గల్లా అరుణ ఏ పార్టీలోకి చేరతారనేది ఆసక్తిగా మారింది. వైసీపీ కండువా కప్పుకుంటారా! బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా! అనేది మరో రెండుమూడ్రోజుల్లో తేలనుందని సమాచారం.
విశాఖపట్టణం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీను వీడతారనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నెల 3న జగన్‌ను కలుస్తారని కూడా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఏడాది నుంచి గంటా పార్టీ వీడతారని ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబరులోనే మరో 10 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ పంచన చేరతారన్నారు. అదే సమయంలో విశాఖభూముల వ్యవహారంలో సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గంటాను అప్పులు కూడా వెంటాడుతున్నాయి. పలు బ్యాంకులు ఎగవేత దారుడుగా నోటీసులు జారీచేశాయనే ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, ఆర్ధికంగా దెబ్బతినకుండా వైసీపీ కండువా కప్పుకుంటారనే అందరూ భావించారు. కానీ.. మంత్రి ముత్తేవి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ గంటా రాకను వ్యతిరేకించారు. ఇటీవల విశాఖలో కొందరు వైసీపీ కార్యకర్తలు గంటా పార్టీలోకి రావటాన్ని నిరసిస్తూ ధర్నాకూడా చేశారు. దీనివెనుక అవంతి ఉన్నాడనేది కూడా తెలుస్తోంది. పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరు శీనయ్యల మధ్య రాజీ కుదిరినట్టుగా తెలుస్తోంది. అందుకే.. గంటా శ్రీనివాస్ వైసీపీకు సంఘీభావం చెబుతారు. ఆయన తనయుడు రవితేజ పార్టీ కండువా కప్పుకుంటారనేది అసలు సారాంశం. ఇది టీడీపీకు ఒక విధంగా షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వాడపల్లి గణేష్ రెబెల్‌గా మారారు. అదే బాటలో విశాఖ నుంచి గంటా పార్టీకు దూరం కావటం చర్చనీయాంశంగా మారింది.



