కోర్కెలు తీర్చమంటూ మొక్కే భగవంతుడికీ తీరని కోరిక అమ్మప్రేమ. భారతీయతలో మాతృదేవోభవ అంటూ తొలి ప్రాదాన్యత అమ్మకే ఇస్తుంటాం. కానీ.. అటువంటి మాతృమూర్తి పట్ల ఒక బిడ్డను రూపాయి కసాయిగా మార్చింది. కొడుకును కసాయి వాడనే ముద్ర వేసేలా చేసింది. కానీ.. అంతగా ఆ కొడుకు ఎంత మనసు చంపుకుని ఉంటాడో.. ఏడ్చిఏడ్చి ఎంతగా అలసి పోయాడో.. ఆ కన్నీరే సాక్ష్యం.
హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్.. ఖరీదైన ప్రాంతం.. సంపన్నుల నివాసాలు. ఆకాశాన్నంటే భవనాలు.. అటువంటి చోట ఫుట్‌ఫాత్‌పై అట్టపెట్టెలో శవం. ఒక్కసారిగా కలకలం.. అందరూ వచ్చి చూస్తున్నారు. పోలీసులు వచ్చారు. అసలే కరోనా కాలం.. కాసేపు తటపటాయించి పీపీఈ కిట్లు వేసుకుని అతిజాగ్రత్తగా పెట్టె కదిలించారు… అది వృద్ధురాలి మృతదేహం కనిపించింది. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించారు.. ఎలాగైతేనేం.. ఆ శవాన్ని అక్కడ పడేసిన వ్యక్తిని తీసుకొచ్చారు. అతడి పేరు తలారి రమేష్ వయసు దాదాపు 40-45 మధ్య ఉంటుందనుకుంటా.. నిజామాబాద్ జిల్లాల నుంచి పొట్టచేతపట్టుకుని భార్య,పిల్లలతో హైదరాబాద్ వచ్చాడు. దొరికిన పనిచేసుకుంటూ… కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆలుమగల మధ్య మనస్పర్థలతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. అసలే కరోనా కాలం.. అమ్మను చూసేందుకు వెళ్దామన్నా చేతిలో డబ్బుల్లేవు. కరోనా వార్తలతో భయపడిన రమేష్ తల్లి భగీరథ కొడుకును చూడాలని తహతహలాడింది. కన్నకొడుకును చూడాలనే తన దగ్గరున్న పైసాపైసా బయటకు తీసి.. బస్సులో హైదరాబాద్ వచ్చింది. బిడ్డ కష్టం చూసి తానే జోలెపట్టి కొంత తెచ్చి ఇచ్చేది. దొరికిననాడు తిన్నారు.. లేకపోతే పస్తులున్నారు. ఈ సమయంలో అమ్మకు జ్వరమొచ్చింది. మాత్రలు, కషాయంతో తల్లిని మామూలు మనిసిని చేయాలని బిడ్డ ప్రయత్నాలు ఫలించలేదు. ఖరీదైన వైద్యం ఇప్పించే స్థోమత లేదు. ఇంతలో అర్ధరాత్రి ఆ అమ్మ కనుమూసింది. పున్నామనరకం నుంచి తప్పించేందుకు దహనక్రియలు చేద్దామనుకున్నా.. చేతిలో చిల్లిగవ్వలేదు. పైగా తల్లి కరోనాతోనే చనిపోయి ఉంటుందనే భయం వెంటాడింది. ఏం చేయాలో పాలుపోని కన్నకొడుకు.. మనసు చంపుకుని.. కన్నీళ్లను దిగమింగి.. అమ్మ శవాన్ని రోడ్డుపక్కన పడేశాడు. ఎందుకిలి చేశావంటూ పోలీసులు ప్రశ్నిస్తేం.. జేబులో పైసల్లేవు.. ఎవర్నడిగినా ఇస్తారో లేదో అనే అనుమానం. కరోనాతో చనిపోయిందని తెలిస్తే.. ఇంకెంత గొడవ చేస్తారనే భయంతో.. కన్నతల్లి శవాన్ని అనాథగా వదిలేయాల్సి వచ్చిందంటూ బోరుమన్నాడు. మాతృమూర్తి మృతదేహాన్ని పడేశాడంటూ.. ఆ కొడుకును కిరాతకుడుగా చూసే సమాజానికి ఆ కన్నకొడుకు కన్నీరు చెప్పే సమాధానం ఒక్కటే.. రూపాయి నన్నిలా కసాయిని చేసిందనీ..!!
కంటనీరు తెప్పించే సంఘటన