అచ్చెన్న అరెస్ట్.. కోడెల ఆత్మహత్య.. సుబ్బయ్య హత్య. వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు బలయ్యారు. చాలా మంది భయపడి అజ్ఞాతంలోకి చేరారు. ఉన్నవారు కూడా సైలెంట్ అవుతున్నారు. ఫ్యాక్షన్ పగలు.. రగిలే సీమలో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యం మళ్లీ జ్వాలను రగిల్చింది. అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి మధ్య మొదలైన గొడవలు మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే కర్నూలులో భూమా కుటుంబం వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ మధ్య వైరం రగులుకుంటోంది. చిత్తూరులో సీకే బాబు జడ్జిలపై సంచలనమైన కామెంట్స్ చేశారు. రాయలసీమ జిల్లాలో వైసీసీ వర్సెస్ టీడీపీ మధ్య మొదలైన గొడవలు.. నందం సుబ్బయ్య హత్యతో తారాస్థాయికి చేరినట్టయింది. సుబ్బయ్య భార్య అపరాజిత తన భర్త హత్య వెనుక సూత్రదారి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి అంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బెనర్జీ, రవి, అనిల్ అనే వ్యక్తులు తామే సుబ్బయ్యను హత్య చేశామంటూ పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసులో ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.
సుబ్బయ్య హత్య తరువాత పరిణామాలు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొన్ని కామెంట్స్ చేశారు. సుబ్బయ్యకు వివాహేతర సంబంధాలు న్నాయని.. ఎవరో కడుపుమండి చంపారంటూ ఆరోపణలు చేశారు. అదే సమయంలోప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ మాయమయ్యారు. ఆమె కళ్లెదుటే తన భర్త హత్య జరగిం దంటున్న పరాజిత ఆరోపణ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్ అజ్ఞాతంలోకి వెళ్లటం.. పైగా.. హతుడి సెల్‌పోన్ మాయమవటంపై కూడా అనుమానాలు ముసురుకున్నాయి. ఏమైనా.. ఏడాదిన్నర వ్యవధిలో వైసీపీ సర్కారు పదేళ్లనాటి ప్రతీకారానికి దిగుతుందంటూ ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఇప్పటికే ఏడాదిన్నర నుంచి తెలుగు తమ్ముళ్లు వేలాది మంది కేసులు
ఎదుర్కొంటున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి వంటి టీడీపీ సీనియర్ నేతలు జైలు ఊచలు లెక్కపెట్టి బయటకు వచ్చారు. ఎంతోమంది హత్యకు గురయ్యారు. ఇటువంటి సమయంలోనే నందం సుబ్బయ్య హత్య అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఇది ప్రభుత్వానికి మచ్చగా మారుతుందనే ఆందోళన లేకపోలేదు. అయితే.. ఆ నాడు టీడీపీ చేసిన హత్యారాజకీయాలనే ఇప్పుడు వైసీపీ కూడా అనుసరిస్తుందనే వాదనకు బలం చేకూరుతుంది. ఇది భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనేది మాత్రం విశ్లేషకుల అభిప్రాయం.



