టీన్ వాయిస్

టీన్ వాయిస్
(..Teen voice )

Hope is a Good Breakfast
but it’s a bad supper..
…..Francis Bacon

“నేటి బాలలే రేపటి పౌరులు”
అని నేర్పింది పెద్దలే..
బాలిక లేదా బాలుడు ఈ భూమ్మీదకు వచ్చి తడబడునడకలతో ,తప్పటడుగులు వేస్తూ వచ్చి రాని చిలకపలుకులకు సంతోషించని తల్లిదండ్రులు లేరు. పిల్లలకు ఏది ఇష్టమో గమనించి అది తెచ్చి పెట్టడము లేదా కొనివ్వడము చేసింది పెద్దలే అంటే తల్లిదండ్రులే..

అభిరుచులు..ఆశయాలు..

బాల్యము నుండి కౌమార దశలో ప్రవేశించాక పిల్లల
రుచులు, అభిరుచులు మరియు ప్రాధామ్యాలు మారిపోతుంటాయి..పిల్లలకు 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా పిల్లకేమి తెలియదని కొందరు తల్లిదండ్రులు నిరంతరం పిల్లలకు ఉద్భోద చేస్తూ నిర్దేశిస్తుంటారు..

పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదలను గమనించరు. పెద్దవాళ్లకున్న అభిప్రాయాలను, పిల్లలపట్ల వారికున్న ఆశ, ఆశయాలను పిల్లలపై రుద్దుతుంటారు.

తినుబండారాలు, బట్టలు , అభిరుచుల్లాగానే పిల్లలు ఏమి చదువుకోవాలి , తనకు దేనిలో స్పష్టమైన ఆసక్తి ఉంది, పిల్లవాడికున్న వైఖరులు, కౌశలాలు ఏమిటి అని గుర్తించరు పెద్దలు..

ఉదాహరణకు తల్లిదండ్రులకు తన పిల్లవాడి ఐ. ఐ. టి. చదివి గొప్ప ఉద్యోగం చేస్తుంటే చూడాలని తల్లిదండ్రులకు ఉంటుంది .కాని పిల్లవాడికి తను ఒక మంచి ఆర్టిస్ట్ గానో, ఫోటో గ్రాఫర్ గానో ఎదగాలని ఆసక్తి ఉంటుంది…ఇక్కడ తల్లిదండ్రుల , పిల్లవాడి ఆశయాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నాయి.. చదివేది , నేర్చుకొనేది పిల్లవాడు కాబట్టి ఆసక్తి ఉన్న రంగంలోనే స్థిరపడనివ్వాలి..అందులో అద్భుతాలు సృష్టించొచ్చు..

అసలు చదువు రావట్లేదు, పిల్లవాడికి నటనలోనో ఆసక్తి ఉందనుకోండి..చదువు రానంత మాత్రాన వాడు దేనికి పనికిరాడనే ఆలోచన కూడా తప్పు.. కొన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టించినవారిలో కొందరికి ప్రాథమిక విద్య కూడా లేదనే విషయం ఇక్కడ తల్లిదండ్రులు గమనించాలి.

కోట్లు ఖర్చు పెట్టి విద్యను కొనలేము..

మా అబ్బాయి తోటివాడు ఎక్కడో కార్పొరేట్ లో మెడిసిన్ సీటు కోరకు కోచింగ్ తీసుకుంటున్నాడు..మావాడ్ని కూడా అక్కడ చేరిస్తే బాగుంటుందని చేర్పిస్తారు. ఇద్దరు ఓకే క్లాస్ విన్నా ఓకే రాంక్ రాకపోవచ్చు.. ఇంత డబ్బు ఖర్చు చేసి చేర్పించాము వాడితో పాటు రాంక్ రావట్లేదని పిల్లవాడిపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులు ఎక్కువ శాతం వున్నారు..ఆ ఒత్తిడి నెగటివ్ రిజల్ట్స్ ని సృష్టించి విద్యార్థి ఒకోసారి ఆత్మహత్య కూడా చేసుకొనే పరిస్థితులకు దారితీయొచ్చు. తల్లిదండ్రులు సంపాదన ఎవరికోసం తమ పిల్లల కోసమే కదా..సీట్ రాలేదు.. కట్టిన ఫీజ్ వృధా అయింది..కానివ్వండి..ఇక్కడ పిల్లవాడు ముఖ్యమా? పెట్టిన ఖర్చు ముఖ్యమా?

పోలిక…

తల్లిదండ్రులు తెలుసుకోవలిసిన అత్యంత ప్రమాదకర విషయం ఏమిటంటే “పోలిక”. ఏ పిల్లవాడు లేదా విద్యార్థి తట్టుకోలేని మానసిక ఒత్తిడి పోలిక.. మీ ఫ్రెండ్ కి 35 వ రాంక్ వచ్చింది, నీకు కనీసం 100 రాంక్ కూడా రాలేదు..నువ్వు వృధా..అని పోలిస్తే విద్యార్థి మానసిక పరిస్థితి దెబ్బతింటుందని తల్లిదండ్రులు గమనించాలి..
అంతేగాక అన్నయ్య బాగా చదువుతున్నాడు, అక్క బాగా చదువుతుంది అని పోలిక చేస్తే..రాంక్ వస్తుందో రాదో దేవుడికెఱుక గాని..అన్న మీద తమ్ముడికి మనసులో తెలియని శత్రుత్వం మాత్రం పెరుగుతుంది..ఇద్దరి కవలలు (Biological Twins ) యొక్క శారీరక లేదా భౌతిక లక్షణాల్లో సారూప్యతలు ఉంటాయి గాని,
మానసిక సారూప్యతల్లో ఖచ్చితంగా ఓకే విధంగా ఉండవు ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం.

మానసిక వికాసం

ఒక్కొక్కరు ఒక్కొక్క వయసు లో మానసిక వికాసం పొందుతారు.. కొందరు 10 వ తరగతి వరకు చదువులో వెనుకబడి ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో వికాసం పొంది మంచి మార్కులు సాధిస్తారు.. కొందరు చదువు ఆసాంతం అత్తెసరు మార్కులతో పాసయి, తరువాత కష్ట పడి మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థాయికి ఎదిగినవారున్నారు..
చదువులో చురుకుతనం లేకపోయినా వ్యాపారంలో స్థిరపడి విజయం సాధించిన వారున్నారు.

తరాన్ని బట్టి మార్పు

డబ్బు సంపాదన, డబ్బు విలువ, డబ్బు వినియోగం, అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు, సామాజిక హోదా వంటి అంశాలు కాల క్రమేణా తరాన్ని బట్టి మారుతుంటాయి.
తండ్రి కాలేజీకి అప్పటి రోజుల్లో నడిచి వెళ్ళాడు, చినిగిన ప్యాంట్లు వేసుకున్నాడు, తినడానికి తిండి కూడా లేదు, 500 రూ. లతో డిగ్రీ చదివాడు.ఓకే.. ఆనాడు పరిస్థితులు అవి.

ఇప్పుడు పిల్లాడికి సెల్ అవసరమా, బైక్ అవసరమా, జీన్ ప్యాంట్లు అవసరమా..అని తల్లిదండ్రులు పిల్లలను ప్రశ్నిస్తుంటారు..అవును ఆ రోజుల్లో డబ్బులున్నా కూడా సెల్ అనే వస్తువు లేదు.. ఆ నాడు రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి నడిచి వెళ్లావ్.. మరి ఇప్పుడు… వస్తువులు మార్కెట్ లో లభ్యమవుతున్న కొద్దీ అవసరాలు , కోరికలు పెరుగుతాయి.. పొదుపు చేసుకోవాలని చెప్పొచ్చు.. కానీ తండ్రి వాడలేదు కాబట్టి పిల్లాడికి ఎందుకు అని పిల్లల్ని నియంత్రించొద్దు.

గొప్ప ఆశయాలు

పిల్లలకు గొప్ప గొప్ప వారి గురించి, వారి జీవిత చరిత్రలు గురించి చెప్పాలి…కానీ తన కొడుకు అబ్దుల్ కలాం అంతటి వాడు కావాలని కలలు కనొచ్చు కానీ కలాం అంతటి వాడు కాలేదని బాధపడకూడదు..కలాం తో సమవయస్కులు కలాం కంటే ధనవంతులు, మేధావులు వున్నారు. కానీ ఎంత మంది కలాం లాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు..
ఒక ఆశయం సాధించాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ, కృషి, కసి, ప్రణాళిక, తపోనిష్ఠలు
ఉంటేనే సాధించగలము.

తమ పిల్లవాడు ఒక మంచి ఉద్యోగిగానో, ప్రొఫెషనల్ గానో,
డబ్బు సంపాదించే యంత్రంగానో ఉండాలని కోరుకోవడం కన్నా..
ఒక మంచి నిజాయితీ గల పౌరుడుగా ఎదగాలని కోరుకోవాలి

By.,
పెర్నా. విశ్వేశ్వరరావు – విశ్లేషకులు
Sattupally
9704197101

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here