హేమిటో ఎన్నికలు.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా! కో-ఆర్డినేషన్ లేకుండా అనుకున్న విధంగా ఎన్నికలు జరిపించగలరా! ఎందుకీ డౌటానుమానం అనుకోవద్దు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం వర్సెస్ వైసీపీ ప్రభుత్వం మధ్య ఇప్పటికీ కోల్డ్‌వార్ సాగుతూనే ఉంది. పరస్పరం పరోక్షంగానే ఏం ఖర్మ ఏకంగా ఎదురెదురుగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఏకగ్రీవం ద్వారా ఎన్నికలకు ముందుగానే తమ సత్తా చాటుకోవాలని వైసీపీ సర్కారు ఉవ్విళ్లూరుతుంది. తూచ్.. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏకగ్రీవం అంటే ఊరుకోను.. అవసరమైతే కోర్టుకెళ్లి మీ తిక్క కుదుర్చుతానంటోంది ఎన్నికల సంఘం. పైగా.. జిల్లాల పర్యటనకూ ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ లెక్కన.. నువ్వొకటంటే.. నేను పదంటా అనేంతగా ఎవరూ తగ్గేలా కనిపించట్లేదు. ఎలాగైనా తన హయాంలో ఎన్నికలు జరిపి తీరాలనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పంతం నెరవేరటం.. ఒక విధంగా వైసీపీ గొంతులో వెలక్కాయ పడినట్టుగా భావిస్తున్నట్టుంది. అందుకే.. ఇప్పటికీ నిమ్మగడ్డపై వైసీపీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
ఆయన టీడీపీ ఏజెంట్ అంటూ ఎద్దేవా చేస్తూనే వస్తున్నారు. ఇక పార్టీలు కూడా ఎవరి జబ్బలు వాళ్లే చరచుకుంటూ తెగ ఫీలవుతున్నాయి. వైసీపీ అయితే అన్ని చోట్ల తామే ఉన్నామనే బలం నిరూపించుకోవాలనే యావలో తప్పటడుగులు వేస్తుందనే గుసగుసలూ లేకపోలేదు. చంద్రబాబు కూడా.. ఇజ్జత్ కా సవాల్‌గా ఎన్నికలను తీసుకున్నారు. కానీ.. సొంత ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు చూస్తున్న సమయంలో తెలుగు తమ్ముళ్లు ఎంత వరకూ బాబు గారి వెన్నంటి ఉంటారనే అనుమానాలు లేకపోలేదు. బీజేపీ, జనసేన పొత్తుతో కొత్త రాజకీయాలకు ఇదే నాందిగా భావిస్తున్న రెండు పార్టీల నేతలు.. తమ పార్టీ శ్రేణులను ఎలా ఐకమత్యం చేస్తారనేది మరో ప్రశ్న. ఎటు చూసినా సందిగ్థత.. సస్పెన్స్‌తో కూడిన ఎన్నికలు ప్రజల మధ్య బావోద్వేగాలు రెచ్చగొట్టకుండా సజావుగా ముగిస్తే చాలని పల్లెలు కోరుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల పుణ్యమాంటూ పచ్చటి ఊళ్లలో అడ్డమైన రాజకీయాలు కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొడతానే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.