ఏపీ.. రాజకీయాలకే కేరాఫ్ చిరునామా. పైరవీలకు పెట్టింది పేరు. అటువంటి చోట అంతర్గత రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూస్తుంది. ప్రధాన రాజకీయపార్టీలన్నీ నిశితంగా గమని స్తుంటాయి. అక్కడ ఎదురయ్యే ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలవనేది ఏ నాటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఆ నాడు ఇందిర, రాజీవ్‌గాంధీ కూడా ఏపీలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారు. అటువంటి ఏపీలో కుల, మతపరమైన అంశాలు తొలిసారి రాజకీయాలకు సవాల్ విసురుతున్నాయి. ఎన్నడూలేని కుల ప్రభావం 2014, 2019లో కనిపించాయి. 2021 స్థానిక ఎన్నికల్లో కొత్తగా మతం రంగు కూడా అంటించాయి రాజకీయపార్టీలు. అటువంటి చోట స్థానిక ఎన్నికలపై ఏడాది కాలంగారచ్చ కొనసాగుతూనే ఉంది. న్యాయస్థానాలు కూడా తరచూ తీర్పులు.. పిటీషన్లతో ఇబ్బందికర వాతావరణం చవిచూస్తుంది. జడ్జిలు మారినా తీర్పులు మారవనే విధంగా ఏపీలో ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలు జరిపేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
అయితే అసలు తంటా ఏమిటంటే 2020 మార్చిలో ఎన్నికలకు రెడీ అన్న ప్రభుత్వం మాటను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తూచ్ కొట్టారు. పైగా కరోనా వల్ల జనం చచ్చిపోతే వామ్మో ఎలా .. అందుకే ఎన్నికలు వాయిదా అంటూ చెప్పుకొచ్చారు. అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఇదంతా టీడీపీ ఆడిస్తున్న డ్రామాగా.. దానిలో నిమ్మగడ్డ సహచరుడుగా ఆరోపణలు చేశారు. బాబు నమ్మినబంటుగా రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ పన్నాగంగా ఎద్దేవా చేశారు. ఏడాది గడచింది.. ఇప్పుడు కరోనా కేసులు. కొత్తగా స్ట్రెయిన్ అంటూ యూకే కరోనా కూడా చేరింది. ఇటువంటి సమయంలో ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికలంటూ హైకోర్టు ఆదేశాలను చూపుతూ ప్రకటన కూడా విడుదల చేసింది. 11 జిల్లాల్లో ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలకు రెఢీ అయింది . దీనిపై స్టే కోసం ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఎన్నికల నిర్వహణ రాజ్యాంబద్దమైన సంస్థల చేతిలో ఉంటుందని.. దీనిపై కోర్టులు కూడా జోక్యం చేసుకోకూడదంటూ టీడీపీ వర్గం చెబుతుంటే.. ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్ దృష్ట్యా కోర్టు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంటుందని వైసీపీ వాదిస్తోంది ఇరువురి మధ్య ఏపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అదే సమయంలో.. ఏపీ ప్రతిష్ఠను రాజకీయపార్టీలు రచ్చకెక్కించి పరువు తీస్తున్నాయనే ఆందోళన సగటు ఏపీ పౌరుడి నోటి నుంచి వినిపిస్తోంది.